విద్యార్ధుల కోసం.. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ ఫోన్
AP CM Jagan speaks to External Affairs Minister on State students trapped in Ukraine.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2022 9:50 AM GMTఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో అక్కడి పరిస్థితులు భయానకంగా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాయగా.. తాజాగా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. భారతీయ విద్యార్థులకు తరలించేందుకు కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని జైశంకర్ ఈ సందర్భంగా సీఎంకి తెలిపారు. ఉక్రెయిన్‌లోని విద్యార్థులను ముందుగా పొరుగు దేశాలకు తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో తరలించనున్నట్లు వివరించారు.
అంతకముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల తరలింపుపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రస్థాయిలో తీసుకున్న చర్యలను సీఎంకు వివరించారు. కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలని.. వారి యోగక్షేమాలు తెలుసుకుని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు చేయటానికి రాష్ట్రం నుంచి తగిన సహకారం ఇవ్వాలని అధికారును ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.