గద్దర్ మరణంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
AP CM Jagan shocked over Gaddar's death. ప్రజా కవి గద్దర్ మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 6 Aug 2023 10:46 AM GMTప్రజా కవి గద్దర్ మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా కవి, గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని పేర్కొన్నారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే అని కొనియాడారు. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారని పేర్కొన్నారు. ఆయన మరణం ఊహించనిది అని విచారం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయని అన్నారు. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందామన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను తన వాణీతో తెలియచేసి.. బడుగుబలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ప్రజల వాణీ ఆస్తమించిందన్న వార్త నన్ను చాలా కలిచివేస్తుంది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజాయుద్ధ నౌకగా పేరొందిన 'గద్దర్' అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారుడిగా, గాయకుడిగా ఆయన తెలంగాణ సమాజంపై చెరగని ముద్రవేశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు అధికారికంగా వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.