సంక్రాంతిలోగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు : సీఎం జగన్ హామీ
మిచౌంగ్ తుపానుతో పంట నష్టపోయిన ప్రాంతాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.
By Medi Samrat Published on 8 Dec 2023 1:20 PM GMTమిచౌంగ్ తుపానుతో పంట నష్టపోయిన ప్రాంతాలలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. రైతులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తుపాను వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూస్తామని.. బాధితులను గుర్తించి పారదర్శకంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 12 వేల మంది తుఫాను కారణంగా నష్టపోయారన్న సీఎం జగన్, ప్రతి ఇంటికీ రేషన్ సరుకులతో పాటుగా 2500 రూపాయల నగదును అందిస్తున్నట్లు చెప్పారు.
టీడీపీ ప్రభుత్వంలో కరువు వచ్చినా, వరద వచ్చినా పట్టించుకోలేదని.. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో మొత్తం మార్చేశామని తెలిపారు సీఎం జగన్. తుపాను కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. ప్రతి ఎకరాను కూడా ఈ–క్రాప్ చేసి నష్టపోయిన ప్రతి రైతుకూ ఇన్సూరెన్స్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని జగన్ తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం 34 లక్షల మందికి మాత్రమే ఇన్సూరెన్స్ ఇచ్చారన్న ఏపీ సీఎం.. వైసీపీ పాలనలో 55 లక్షల మందికి రూ.7800 కోట్లు ఇన్సూరెన్స్ కింద చెల్లించామన్నారు. వచ్చే నెల సంక్రాంతిలోగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తామని తెలిపారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సీఎం జగన్ కోరారు.