నేడు, రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
AP CM Jagan Mohan reddy to vist in floods impacted areas.ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు
By తోట వంశీ కుమార్ Published on 2 Dec 2021 10:49 AM ISTఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా పలు చోట్ల చెరువులకు గండ్లు పడి పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునగగా.. పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. కాగా.. వరద ప్రభావిత ప్రాంతాలైన కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈరోజు, రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. బాధిత ప్రజలు, రైతులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..
- ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు జగన్ బయలుదేరతారు. 10.50 గంటలకు కడప జిల్లా మందపల్లి (రాజంపేట) చేరుకుంటారు. అక్కడ నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్తారు. అటు నుంచి పుల్ల పొత్తూరు గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు. సహాయశిబిరంలో ఉన్న బాధితులతో నేరుగా సీఎం మాట్లాడుతారు.
- మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఎగుమందపల్లి వెళ్లి గ్రామంలో వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో స్వయంగా కాలినడకన పర్యటిస్తారు.
- ఎగుమందపల్లి నుంచి నేరుగా అన్నమయ్య డామ్ సైట్‌కి వెళతారు. దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలిస్తారు.
- మధ్యాహ్నం 2.15 గంటలకు మందపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో జగన్ సమీక్ష నిర్వహిస్తారు.
- మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని, కాలనీ ప్రజలతో వరదనష్టంపై ముఖాముఖి, సమీక్ష నిర్వహించనున్నారు.
- 4.30 గంటలకు ఏర్పేడు మండలం, పాపనాయుడు పేట గ్రామానికి చేరుకుంటారు. పాపనాయుడుపేటలో వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. అక్కడ నుంచి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళతారు
- అనంతరం తిరుపతిలో పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి పద్మావతి అతిధి గృహంలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.
ఇక రేపు చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.