మోదీకి సీఎం జగన్ లేఖ.. ముఖ్యమైన సలహా ఏమిటంటే
AP CM Jagan Letter To PM Modi.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు.
By Medi Samrat Published on 11 May 2021 3:15 PM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై లేఖలో చర్చించడమే కాకుండా.. ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజెన్ సరఫరా చేయాలని కోరారు. ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నప్పటికీ.. అది ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ కి మంజూరు చేయాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామని అది సరిపోవడం లేదని తేల్చి చెప్పారు. మే 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యమైంది. ఆక్సిజన్ రావడం ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్ టన్నులకు పెంచాలని లేఖలో ప్రస్తావించారు.
భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో తెలిపారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ల తయారీ ఫార్ములాను ఇతర సంస్థలకు కూడా అందిస్తే, వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందని జగన్ లో లేఖలో చెప్పుకొచ్చారు. పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి అని ఆయన అన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించాయి ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు వైఎస్ జగన్. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయొచ్చని సూచించారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ, ఆంక్షలు విధిస్తున్నా వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారం అని సీఎం జగన్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా లేవని.. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలినాళ్లలో ఏపీలో రోజుకు 6 లక్షల డోసులు ఇచ్చే స్థితిలో ఉన్నామని, కానీ ఇప్పుడు తగినన్ని డోసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. టీకా తయారీ సాంకేతిక సమాచారాన్ని ఇతర సంస్థలతో పంచుకునేలా భారత్ బయోటెక్ ను ఆదేశించాలని కోరారు. తద్వారా దేశవ్యాప్తంగా టీకా ఉత్పత్తిదారులను ప్రోత్సహించి, ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లను తయారుచేయాలని సూచించారు. ఈ కష్టకాలంలో యావత్ ఉత్పత్తిరంగం టీకా తయారీ దిశగా కదలాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ చెప్పారు.