ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
AP CM Jagan Delhi Tour. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది.
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి గన్నవరం బయల్దేరారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పోలవరం, రీ సోర్స్ గ్యాప్ కింద నిధులు, విభజన హామీలు, ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ప్రధానికి సీఎం జగన్ వినతిపత్రం అందజేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయడానికి తగిన సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం రూ.2,900 కోట్లు ఖర్చు చేశామని.. వీటిని రీయింబర్స్ చేయాలని ప్రధానిని కోరారు జగన్. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు.
టెక్నికల్ అడ్వైజర్ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని.. చేసిన పనులకు 15 రోజుల్లోగా రీయింబర్స్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరారు
రీసోర్స్ గ్యాప్ కింద ఏపీకి రావాల్సిన రూ.32,625.25 కోటట్లు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశాన్ని ప్రస్తావించారు సీఎం. తెలంగాణ డిస్కంల నుంచి రూ.6,756 కోట్ల బకాయిలు ఉన్నాయని.. 8 ఏళ్లుగా సమస్య పరిష్కారం కాలేదని.. విభజన హామీలు అమలు చేయాలని కోరారు.
అలాగే పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరో 12 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని కోరారు. ఏపీఎండీసీకి బీచ్ శాండ్ మినరల్ ఏరియాలను కేటాయించాలని కోరారు సీఎం జగన్.
ఈ భేటీ అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం జగన్. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు భేటీ కొనసాగింది. భేటీలో విద్యుత్ బకాయిలపై చర్చ జరిగింది.