రేపు AI సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ సీఎం..అంతర్జాతీయ టెక్ సంస్థలతో కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు

By -  Knakam Karthik
Published on : 19 Feb 2026 8:59 PM IST

Andrapradesh, Cm Chandrababu, India AI Summit 2026, IBM, AI Revolution

రేపు AI సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ సీఎం..అంతర్జాతీయ టెక్ సంస్థలతో కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటన నిమిత్తం సీఎం ఈ సాయంత్రం జైపూర్ చేరుకుని, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ వివాహ వేడుకలో పాల్గొని అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఢిల్లీ చేరుకుని “ఏఐ యాక్సిలరేటర్స్: ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్” అనే అంశంపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాదలతో కలిసి ప్రసంగించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకోనుంది. రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటం టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం (IBM) సంస్థతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు NIELITతో, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం UNICCతో ఒప్పందాలు జరగనున్నాయి. అదనంగా ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో 'ఏఐ ట్యూటర్' ప్రోగ్రామ్, ఎన్విడియా (NVIDIA) సహకారంతో 'ఏఐ లివింగ్ లాబ్స్' ఏర్పాటు చేయనున్నారు.

మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి సీఎం పాల్గొంటారు. అనంతరం బ్రిటన్ ఏఐ మంత్రి కనిష్క నారాయణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భేటీ అయ్యి ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం అడోబ్ (Adobe) సీఈఓ శంతను నారాయణ్, ఆరామ్‌కో ఇండియా ఎండీ అబ్దుల్ రెహ్మాన్‌లతో చంద్రబాబు విడివిడిగా భేటీ కానున్నారు. ఈ పర్యటన ద్వారా ఏపీకి భారీ పెట్టుబడులు మరియు సాంకేతిక నైపుణ్యం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story