ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును వరించింది.

By -  Knakam Karthik
Published on : 18 Dec 2025 12:24 PM IST

Andrapradesh, Cm Chandrababu, Economic Times, ‘Business Reformer of the Year’ Award

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

అమరావతి: దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గానూ... ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రదానం చేయనున్నారు.

ఈ అవార్డును దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. ఈసారి జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తోంది. ఈ అవార్డును గతంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్ (2024), ఎస్. జైశంకర్ (2023), నిర్మలా సీతారామన్ (2021), మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్ (2019), కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) వంటి వారు అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రి వర్గ సహచరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story