గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ప్రజల్లో అసహనం పెరిగింది: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

By Knakam Karthik
Published on : 25 March 2025 3:30 PM IST

Andrapradesh, Cm Chandrababu, District Collectors,

గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసంతో ప్రజల్లో అసహనం పెరిగింది: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన తొలిరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, గత తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిందని, ఆ నష్టాన్ని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం, జిల్లాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ల పనితీరు ప్రజలపై శాశ్వతమైన ప్రభావం చూపుతుందని, వారి పనితీరును నిరంతరం సమీక్షిస్తామని అన్నారు.

ప్రజల ఆమోదం పొందేలా పాలన ఉండాలని, గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం కారణంగా ప్రజల్లో అసహనం పెరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. కూటమికి 93 శాతం స్ట్రైక్‌రేట్ రావడానికి ఇదే కారణమని, ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే తగినంత ఆదాయం ఉండాలని, అప్పులతో చేస్తే అవి స్థిరంగా ఉండవని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేసిందని, వాటిని తీర్చడానికి వడ్డీలు కట్టాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలకు గౌరవంగా అందించాలని, ప్రతి అధికారి 'ప్రజలే ఫస్ట్' అనే విధానంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న 22 రకాల సేవలకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, ఈ ప్రభుత్వం తమ కోసమే పనిచేస్తోందనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విజన్ 2047 ఒక దిక్సూచిలాంటిదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయం వరకు ప్రణాళికలు ఉండాలని, జిల్లాలో కలెక్టర్ విజన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. రాష్ట్రంలో రూ.55 వేల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని, వాటిని రెండేళ్లలో పూర్తి చేయాలని, పర్యావరణ అనుమతుల కోసం కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు.

జిల్లాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై దృష్టి పెట్టాలని, మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని ముఖ్యమంత్రి అన్నారు. రాబోయే 5 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు సాధించేలా ముందుకెళుతున్నామని, పర్యాటకంలో 20 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. జీఎస్టీపై సమీక్షలు చేసి బకాయిలు వసూలు చేయాలని, పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా ఉండాలని నిర్దేశించారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు రాకుండా ఉన్నప్పుడే బాగా పనిచేసినట్లు భావిస్తామని, శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని, గంజాయి సరఫరా చేసి, రౌడీయిజం చేసేవారి పట్ల ఉక్కుపాదం మోపాలని, శాంతిభద్రతల పరిరక్షణకు కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.

Next Story