వారి కారణంగా రాష్ట్రం కళ తప్పింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర కళ తప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik
వారి కారణంగా రాష్ట్రం కళ తప్పింది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర కళ తప్పిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం సృష్టించిన సమస్యలను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు, వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్నీ చిక్కుముడులేనని, వాటిని ఒక్కొక్కటిగా విప్పుతున్నామని చెప్పారు. ప్రజలు ముందు అనే నినాదంతో తమ సర్కారు ముందుకు వెళుతోందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను సమన్వయం చేస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ అవసరం ఎక్కువని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు తాను సెల్ ఫోన్, ఐటీలను ప్రోత్సహిస్తే చాలామంది విమర్శించారని గుర్తుచేసుకున్నారు. సెల్ ఫోన్ తిండిపెడుతుందా అంటూ కామెంట్లు చేశారన్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్ ద్వారా ఎన్నో పనులు చక్కబెట్టుకునే వీలు కలుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు. వివిధ సర్టిఫికెట్ల కోసం గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా క్షణాలలో ఫోన్ కు సర్టిఫికెట్ పంపిస్తున్నామని చంద్రబాబు వివరించారు.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం మార్గదర్శి-బంగారు కుటుంబం, పీ4 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామని చంద్రబాబు చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అసాధ్యమనేది లేదన్నారు. భవిష్యత్తులో ఏపీని పేదవారు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ఇది సాధ్యమైన రోజు తన జన్మ చరితార్థం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు