ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని కోర్టు పరిధి నుండి తప్పించుకునేందుకే ఉపసంహరించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బిల్లు ఉపసంహరణపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధిలేన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో సోమువీర్రాజు మాట్లాడారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారని అన్నారు. ఆ మాట అన్నారో లేదో ఒక్కసారి ముఖ్యమంత్రి, మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. శాసనసభలో ఆత్మను టేబుల్‌పై పెట్టి మాట్లాడరని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. సభలో పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.
అబద్దాలు, వ్యక్తిగత దూషణలు, బూతులు తిట్టుకునేందుకు శాసనసభను వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై శాసనసభ స్పీకర్ ఆలోచించాలన్నారు. రాయలసీమ నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేశారని అన్నారు. అయినా ఏ ఒక్కరూ కూడా రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడు కర్నూలులో కోర్టు పెడితే రాజాధాని అవుతుందా అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు. రాయలసీమపై జగన్‌కు చిత్తశుద్ధి లేదని, ఒక వేళ ఉంటే తెలుగు గంగ, హంద్రీనీవా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదంటూ నిలదీశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం వికేంద్రీకరణ చేస్తామని ప్రభుత్వం చెప్తోందని, అయితే దాని కోసం ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా అంటూ ప్రశ్‌నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న మీరు.. వికేంద్రీరణ ఎలా చేయగలుగుతారని సోమువీర్రాజు నిలదీశారు. ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. తిరుపతిలో ఐఐఎం, గుంటూరులో ఎయిమ్స్, అనంతపురం, కర్నూలులో సెంట్రల్ యూనివర్సిటీలు, విశాఖలో పెట్రో కాంప్లెక్స్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిందన్నారు. మీరేం చేశారో చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని సోమువీర్రాజు ప్రశ్నించారు.