ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో.. ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, ఆరు లోక్‌సభ సీట్లలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను హైకమాండ్‌కు అందించనున్నారు. అలాగే పొత్తుపై విమర్శలు చేస్తూ పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు రాసిన లేఖపైనా సమాలోచనలు చేస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు పంచాయితీ పెట్టారు. ఈ క్రమంలోనే వీలైనంత తొందరగా అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసి ప్రచారం ప్రారంభించాలని జాతీయ నేతలు యోచిస్తున్నారు.
ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీజేపీ పెద్దలు పురంధేశ్వరితో ఏపీలో రాజకీయ పరిణామాలు, టికెట్లు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్లపై కమలం పార్టీ అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని సీట్లలో మార్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 21లోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.