సాధారణంగా మీడియా ఛానల్స్ లో డిబెట్ ప్రోగ్రామ్స్ లో వ్యక్తుల మద్య తారా స్థాయిలో చర్చలు జరగడం సహజం. కొన్ని సార్లు ఇలాంటి డిబెట్ కార్యక్రమాల్లో మాటల యుద్దాలు ఓ రేంజ్‌లో జ‌రుగుతాయి. మరికొన్ని సార్లు వ్యక్తులపై దాడులు జరిగిన సంఘటనలు కూడా జరిగాయి. ఆ సమయంలో ఇంటర్వ్యూ తీసుకునే వారు వారిని నివారించి మద్య సయోధ్య కుద‌ర్చ‌డం చూస్తుంటాం. తాజాగా ఏబీఎన్‌ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యింది.

ఈ నేపథ్యంలో పత్రికా ప్రమాణాలు, టీవీ ఛానల్‌ల నైతిక విలువలను గాలికొదిలేసి.. తెలుగుదేశం పార్టీ కరపత్రికలా, ప్రసార సాధనంలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బహిష్కరించింది. ఓ ప్రముఖ వ్యక్తిపై ఇలా చెప్పుతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయించకుండా, తిరిగి అతన్ని మ‌రుస‌టి రోజే చర్చకు ఆహ్వానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తింది. అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్‌, ఆంధ్రజ్యోతి పత్రికలపై నేటి నుంచి బహిష్కరణ విధిస్తున్నట్లు లేఖ‌లో పేర్కొంది. అంతే కాదు భవిష్యత్ లో ఈ ఛానెల్ కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని ఆదేశించింది.

ఇదిలావుంటే.. ఎల్లో మీడియాకు ఫేవర్ గా వ్యవహరిస్తూ.. డిబెట్ కార్యక్రమానికి పిలిచి ఇలా అవమానించడం హేయమైన విషయం అని.. ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జి వుల్లూరి గంగాధర్ వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ యొక్క ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ ఏబీఎన్ ఛానల్ ఏకపక్షంగా వ్యవహరించడం సరైన పద్దతి కాదని.. ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఏబీఎన్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని ప్రకటించారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు

సామ్రాట్

Next Story