ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోంది : స్పీకర్ తమ్మినేని సీతారాం
AP Assembly Speaker Thammineni Seetharam. రాష్ట్రంలో పేదరికంలో ఉండకూడదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రమాణాలు కలిగిన జీవన విధానం
By Medi Samrat Published on 6 Dec 2022 4:15 PM GMTరాష్ట్రంలో పేదరికంలో ఉండకూడదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రమాణాలు కలిగిన జీవన విధానం కల్పించాలని, అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. రాష్ట్రంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని తెలిపారు. విజయవాడ కొత్త ఆర్టీసీ కాలనీలోని స్పీకర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. శతాబ్ధాల కాలం నుంచి బీసీలు వివక్షతకు గురయ్యారని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రభుత్వంలో బీసీలకు ప్రాధ్యానత ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలకు సమ న్యాయం చేస్తూ.. రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తూ అందరికీ సామాజిక న్యాయం చేసిందన్నారు.
బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదని.. బ్యాక్ బోన్ క్లాసెస్ అని నిరూపించిన ప్రభుత్వం అని కొనియాడారు. బీసీలు అంటే భారతదేశ నాగరికత, సంస్కృతికి ప్రతీక అన్నారు. వృత్తి నైపుణ్యంతో భారతదేశాన్ని ముందుకు నడిపింది బీసీలేనని తెలిపారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో బీసీలకు ఖర్చుచేసింది కేవలం 964 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్లలో 90 వేల 415 కోట్ల రూపాయలను బీసీల సంక్షేమం కోసం వెచ్చించిందని వివరించారు. బీసీల అభ్యున్నతి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, సహకార రంగంలో చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, డైరెక్టలు ఇలా అన్ని రకాల పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కే దక్కుతుందని స్పీకర్ తమ్మినేని తెలిపారు.