చట్టసభలకు రాని వారికి 'నో వర్క్, నో పే'..ఏపీ స్పీకర్ సంచలన ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ప్రతిపాదన చేశారు.
By - Knakam Karthik |
చట్టసభలకు రాని వారికి 'నో వర్క్, నో పే'..ఏపీ స్పీకర్ సంచలన ప్రతిపాదన
అమరావతి: చట్టసభలకు హాజరుకాని ప్రజా ప్రతినిధులకు కూడా "నో వర్క్ - నో పే" పని లేకపోతే జీతం లేదు నిబంధనను వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన ప్రతిపాదన చేశారు. ఒకవేళ అప్పటికీ తీరు మార్చుకోకపోతే, ప్రజలే వారిని వెనక్కి పిలిపించేలా "రైట్ టు రీకాల్" హక్కును కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న చట్ట సభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. "ప్రజలపట్ల శాసనవ్యవస్థ జవాబుదారీతనం" అనే అంశంపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నెలకొన్న పరిస్థితులను ఉదహరిస్తూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 జూన్‌లో ఎన్నికైనప్పటి నుంచి కొంతమంది సభ్యులు ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సభకు హాజరు కాలేదని, కనీసం చర్చల్లో కూడా పాల్గొనలేదని ఆయన తెలిపారు. సభకు రాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా జీత, భత్యాలు మాత్రం తీసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇలాంటి అనైతిక ప్రవర్తన వల్ల ప్రజల దృష్టిలో ప్రజా ప్రతినిధుల పట్ల చులకన చులకన భావన ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్ట సభకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం స్పష్టమైన నిబంధనలు లేనందున, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి మార్గం చూపాలని అయ్యన్నపాత్రుడు కోరారు. సమావేశంలో రెండు ప్రధానమైన సూచనలు చేశారు. ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాలు కోత విధించినట్లే, సభకు రాని ప్రజా ప్రతినిధులకు కూడా "నో వర్క్ - నో పే" నిబంధన అమలు చేయాలని ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తే, రాజ్యాంగాన్ని లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే.. వారిని వెనక్కి పిలిపించే "రైట్ టు రీకాల్" హక్కును ఓటర్లకు కల్పించాలని కోరారు.