గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడంతో రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి నేతలు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మేకపాటి గౌతమ్‌రెడ్డి వివాదరహితుడు, అహం లేని వ్యక్తి అని అన్నారు. సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యామని, ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
సంతాప తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. అదే విధంగా ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమై, శాసనమండలిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సంతాప తీర్మానంపై చర్చ అనంతరం శాసన మండలి వాయిదా పడనుంది. బడ్జెట్ సమావేశాలను ఈ నెల 25 వరకు నిర్వహించాలని శాసనసభ బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. గౌతంరెడ్డి మృతికి సంతాప సూచకంగా 9వ తేదీన అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మార్చి 10న చర్చకు రానుంది.