ఆరోగ్యాంధ్ర ప్రదేశే మా లక్ష్యం, రైతు సంక్షేమమే ధ్యేయం: ఏపీ గవర్నర్‌

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభ, మండలిని ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు.

By అంజి  Published on  5 Feb 2024 6:39 AM GMT
AP Assembly, Governor Abdul Nazir, AP government, APnews

ఆరోగ్యాంధ్ర ప్రదేశే మా లక్ష్యం, రైతు సంక్షేమమే ధ్యేయం: ఏపీ గవర్నర్‌

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభ, మండలిని ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ బడ్జెట్ కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్ లను ప్రవేశ పెట్టిందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. 'మాది పేదల ప్రభుత్వం. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీంతో అణగారిన వర్గాలతో పాటు సమాజంలో అన్ని వర్గాలు లబ్ధి పొందాయి. పేదరికం 11.25 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నాం' అని బడ్జెట్‌ ప్రసంగంలో గవర్నర్‌ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలను తమ ప్రభుత్వం చేపట్టిందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తెలిపారు.

'పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నాం. వచ్చే సంవత్సరం నుంచి 1వ తరగతికి ఐబీ విధానం అమలు చేస్తాం. నాడు - నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మారుస్తాం. విద్యారంగంపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. 1 నుంచి 10 వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అందిస్తున్నాం. ఇందుకు ఏటా రూ.1910 కోట్లు ఖర్చుపెడుతున్నాం' అని పేర్కొన్నారు. అలాగే ఏపీలో 10,132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని గవర్నర్‌ నజీర్‌ ప్రకటించారు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల ద్వారా ప్రజలు సేవలు అందిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు 53,126 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం కింద 3.03 కోట్ల ఓపీ సేవలు అందించామన్నారు. 1.3 కోట్ల గ్రామీణ రోగులకు ఇంటి వద్దే వైద్య సేవలు కల్పించామని, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా సురక్ష అమలు చేశామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్‌ నజీర్‌ తెలిపారు. ఉచిత పంటల బీమా కింద 54.75 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్ల క్లైమ్‌లు చెల్లించామన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద 73.88 లక్షల మందికి రూ.1833 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. వైఎస్సార్‌ రైతు భరసా - పీఎం కిసాన్‌ ద్వారా ఏడాదికి ప్రతి రైతుకి రూ.13,500 చొప్పున ఇప్పటి వరకు 53.53 కోట్ల మందికి రూ.33,300 కోట్లు చెల్లించామని వివరించారు.

Next Story