ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..స్ట్రిక్ట్ రూల్స్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.

By Knakam Karthik  Published on  22 Feb 2025 5:48 PM IST
Andrapradesh, Assembly Sessions, Speaker, Cm Chandrababu, Ys Jagan

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..స్ట్రిక్ట్ రూల్స్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా పాసులు జారీ చేయనున్నారు. భద్రతా కారణాల రీత్యా పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్‌తో పాసులు జారీ చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఒకటవ గేటు నుంచి మండలి ఛైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే పర్మిషన్ ఇవ్వనున్నారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఇస్తూ బులెటిన్ జారీ చేశారు.

మండలి ఛైర్మన్, స్పీకర్, సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్‌లో ఇతరులకు ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడించారు. మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ప్రాంగంణలోకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదని స్పష్టం చేస్తూ బులిటెన్ రిలీజ్ చేశారు. ఒక వేళ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్‌లో డిపాజిట్ చేయాలని సూచించారు. ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ లాంటి వాటితో విధాన పరిషత్ ప్రాంగణంలోకి ప్రవేశం లేదని వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా సభ్యుల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావొద్దని స్పష్టం చేశారు.

కాగా ఈ నెల 24వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం చేయనున్నారు. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ పక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జగన్ సమాచారం పంపించినట్లు తెలుస్తోంది.

Next Story