ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
AP assembly meetings adjourned till tomorrow. ఏపీ అసెంబ్లీ మూడోరోజు సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.
By Medi Samrat Published on 19 Sep 2022 12:21 PM GMTఏపీ అసెంబ్లీ మూడోరోజు సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. పారిశ్రామిక ప్రగతి, ఆర్థికాభివృద్ధి, విద్య, వైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని రైతు వ్యతిరేకి వైఎస్ జగన్ అంటూ నినాదాలు చేశారు. రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించక పోవడంతో పొడియం వద్దకు దూసుకొచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సభలో కీలక అంశాలపై చర్చించాలని అందుకు సహకరించాలని టీడీపీ సభ్యులను అభ్యర్థించారు. అందుకు అంగీకరించకపోవడంతో సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గత మూడేళ్లలో అభివృద్ధి దిశగా అనేక అడుగుల పడ్డాయని, ప్రభుత్వ చర్యలతో పారిశ్రామిక రంగం నిలదొక్కుకుందని వెల్లడించారు. మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలో రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించాయని సీఎం జగన్ తెలిపారు. భారీ పరిశ్రమలతో రూ.46,280 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా 62,541 మందికి ఉపాధి కలుగుతోందని అన్నారు. మరో 40 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, ఎంఎస్ఎంఈ రంగానికి ఇప్పటివరకు రూ.2,500 కోట్ల ప్రోత్సాహకాలు అందజేశామని చెప్పారు. ఈ రంగంలో 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. లక్షల మందికి ఉపాధినిచ్చే ఎంఎస్ఎంఈ రంగాన్ని చంద్రబాబు నాశనం చేశారని, కానీ తమ చర్యలతో ఎంఎస్ఎంఈ రంగం మళ్లీ పుంజుకుందని అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏపీకి ఇస్తామని కేంద్రం చెప్పిందని, కానీ ఆ పార్క్ వద్దంటూ టీడీపీ కేంద్రానికి లేఖ రాసిందని వెల్లడించారు. పారిశ్రామిక ప్రగతి చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా ఉందని, గతంలో కంటే రాష్ట్రానికి అధికమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో సగటున రూ.11 వేల కోట్ల పెట్టుబడులు వస్తే, ఈ మూడేళ్ల వ్యవధిలోనే తాము సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు.