ఏపీ అసెంబ్లీ వాయిదా
AP assembly adjourned. ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ సుదీర్ఘ వివరణ
By Medi Samrat Published on 16 Sept 2022 5:15 PM ISTఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ సుదీర్ఘ వివరణ అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడింది. శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఏపీ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభ నుండి నిన్న టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురి కాగా, ఇవాళ కూడా స్పీకర్ ఆగ్రహానికి గురై సస్పెండ్ అయ్యారు. సభలో వికేంద్రీకరణ అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టగా, నేడు ఆర్థికాభివృద్ధి అంశంపై చర్చ చేపట్టారు.
వైసీపీ ప్రభుత్వం సభలో 8 బిల్లులు ప్రవేశపెట్టింది. ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు ఉంచారు. అప్పులపై ఎల్లో మీడియా, చంద్రబాబు రోజూ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విభజన నాటికి రాష్ట్రం రుణాలు రూ.1.26 లక్షల కోట్లు ఉండగా.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.2.69 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో 123 శాతం అప్పులు పెరిగాయని అన్నారు. ఈ మూడేళ్లలో రూ.3.82 లక్షల కోట్లకు రుణాలు చేరాయని తెలిపారు. మూడేళ్లలో పెరిగిన రుణం 41.83 శాతం మాత్రమేనని.. ఈ మూడేళ్లలో రాష్ట్రం అప్పులు 12.73 శాతం మాత్రమేనని సీఎం జగన్ వివరించారు.