వైఎస్ వివేకానంద హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

Another Twist in YS Viveka Murder Case.ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి దివంగ‌త నేత వైఎస్ వివేకా హత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 9:33 AM GMT
వైఎస్ వివేకానంద హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి దివంగ‌త నేత వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వివేకా హ‌త్య కేసులో త‌మ‌ను అరెస్టు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సునీల్ కుమార్ యాద‌వ్ స‌హా న‌లుగురు వ్య‌క్తులు ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కడప జిల్లా మోతునూతలపల్లి కి చెందిన వై సునీల్ యాదవ్, అతని కుటుంబానికి చెందిన మరో ముగ్గురు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో తమపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా పేర్కొన్నారు.

విచారణ అవసరమని భావిస్తే.. న్యాయవాది సమక్షంలో విచారించేలా ఆదేశించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. ఈ ఏడాది సీబీఐ తనకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ఇవ్వడంతో ఢిల్లీ వెళ్లానని.. విచారణ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించాడు. అంతేకాదు.. తన అనుమతి లేకుండానే బలవంతంగా లై డిటక్టర్ వినియోగించారని పిటిషనర్ ఆరోపించారు. ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారన్నారు. వివేకా హత్య కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేశాడు. ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు శుక్రవారం వివేకా ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే రంగయ్యను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసులో ముగ్గురి పేర్లు రంగయ్య వెల్లడించగా.. అనుమానితుల్లో సునీల్ కుమార్ యాదవ్ పేరు కూడా ఉంది. సునీల్‌ను ఇప్పటికే సీబీఐ అధికారులు చాలాసార్లు ప్రశ్నించారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు న్యాయ‌స్థానంలో వాంగ్మూలం ఇచ్చిన త‌రువాత శుక్ర‌వారం రాత్రి పులివెందుల‌కు చేరుకున్న వాచ్‌మెన్ రంగ‌య్య.. కొంత మంది స్థానికులు, విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ వీడియోలు వైర‌ల్ అయ్యాయి. న్యాయ‌మూర్తి ఎదుట ఎం చెప్పార‌ని అడ‌గ్గా..త‌న‌కు భ‌యం వేస్తోంద‌ని రంగ‌న్న స‌మాధానం ఇచ్చారు. భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని ప‌దే ప‌దే ప‌శ్నించ‌గా.. అక్క‌డున్న వారి చెవిలో ఎర్ర‌గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, సునీల్‌కుమార్ పేర్ల‌ను చెప్పారు. ఎవ‌రితోనూ ఏమీ చెప్పొద్ద‌ని, ఏం అడిగినా ఏమీ తెలియ‌ద‌ని స‌మాధానం చెప్పాలంటూ త‌న‌కు సీబీఐ అధికారులు సూచించార‌ని వివ‌రించారు. అయితే..అంత‌క‌ముందు మాత్రం అస‌లు న్యాయ‌మూర్తితో ఏం చెప్పానో త‌న‌కు గుర్తులేద‌ని రంగ‌న్న చెప్పిన విష‌యం తెలిసిందే.

Next Story