బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
By - Knakam Karthik |
బంగాళాఖాతంలో మరో అల్పపీడనంతో ఏపీలో మళ్లీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని, ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
సోమవారం (17-11-2015) నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మంగళవారం (18-11-2025) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.