ఏపీలో కలకలం.. పార్శిల్‌లో డెడ్‌బాడీ.. షాక్‌కు గురైన స్థానికులు
ఓ ఇంటికి పార్శిల్‌లో గుర్తు తెలియని డెడ్ బాడీ వచ్చిన ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలో కలకలం రేపింది.
By అంజి Published on 20 Dec 2024 8:00 AM GMTఏపీలో కలకలం.. పార్శిల్‌లో డెడ్‌బాడీ.. షాక్‌కు గురైన స్థానికులు
ఓ ఇంటికి పార్శిల్‌లో గుర్తు తెలియని డెడ్ బాడీ వచ్చిన ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలో కలకలం రేపింది. ఉండి మండలం యండగండిలోని ఇంటికి పార్శిల్‌లో మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతదేహం పార్శిల్‌తో పాటు రూ.1.3 కోట్లు డిమాండ్ చేస్తూ, చెల్లించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కుటుంబాన్ని బెదిరిస్తూ లేఖ వచ్చింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నయీం అస్మి పరిశీలించారు.
నాగ తులసి అనే మహిళ గతంలో ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని ఆర్థిక సహాయం కోరింది. లైట్లు, ఫ్యాన్లతో పాటు విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని వాట్సాప్ ద్వారా ఆమెకు సమాచారం అందించారు. గురువారం రాత్రి ఓ వ్యక్తి పార్శిల్‌ను డొర్ డెలివరీ చేశాడు. అయితే, తులసి పార్శిల్‌ను తెరిచి చూడగా, దాదాపు 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహం, బెదిరింపు లేఖను కనుగొన్నారు.
మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం వ్యక్తి 4-5 రోజుల క్రితం మరణించినట్లు సూచిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతుడు, పార్శిల్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీమ్ అస్మీ విచారణను పర్యవేక్షించేందుకు గ్రామాన్ని సందర్శించారు.