విజయవాడలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కలిశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు.. బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
కాగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, బిటి నాయుడు, కొణిదల నాగబాబు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ల చేత బుధవారం శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు. రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని చైర్మన్ చాంబరులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కె.అచ్చన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఉప కార్యదర్శి రాజ్ కుమార్, ఇతర అధికారులు, పలువురు ఎంఎల్ఏలు, ఎంఎల్సిలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.