ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జనవరి 10 నుండి 18 వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. దీనితో విద్యార్థులకు తొమ్మిది రోజుల పండుగ సెలవులు లభిస్తాయి. విద్యా క్యాలెండర్ ప్రకారం జనవరి 19న తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి. కాగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులను తమ ఇళ్లకు తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఈ పండుగను రాష్ట్రంలోని ప్రజలు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ఉద్యోగ, వ్యాపార, విద్య వంటి కారణాలతో ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు సంక్రాంతికి తమ సొంతూళ్లకు చేరుకుని స్నేహితులు, కుటుంబసభ్యులతో ఉత్సహంగా గడుపుతారు. 14వ తేదీ భోగి , 15వ తేదీ మకర సంక్రాంతి , 16వ తేదీ కనుమ పండుగలు వస్తున్నాయి. విద్యార్థులకు జనవరిలో మొత్తం 13 సెలవులు వచ్చాయి.
అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది. జనవరి 16వ తేదీన కనుమ రోజును పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.