ఉచిత గ్యాస్ సిలిండర్లు.. రేపటి నుంచే బుకింగ్ చేసుకోండి..!
అర్హులైన వారందరికీ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 28 Oct 2024 3:32 AM GMTఉచిత గ్యాస్ సిలిండర్లు.. రేపటి నుంచే బుకింగ్ చేసుకోండి..!
అమరావతి: అర్హులైన వారందరికీ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వారికి ఈ పథకం అమలు చేయబడుతుంది. ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది రూ.2,684.75 కోట్ల మేర ప్రభుత్వం పై భారం పడనుంది. అయిల్ కంపెనీలకు అడ్వాన్సుగా రూ.894.92 కోట్లను రేపు చెక్కు రూపేణా ప్రభుత్వం చెల్లించనుంది.
ఉచిత గ్యాస్ బుకింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ బుకింగ్ చేసుకోగానే ఒక ఎస్.ఎం.ఎస్. సంబందిత లబ్దిదారుని ఫోన్ నెంబరుకు వెళుతుందని, గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండ్లను డెలివరీ చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల తెలిపారు. అదే విధంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డి.బి.టి. విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోని నేరుగా రాయితీ సొమ్ము జమ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చని వెల్లడించారు.
ఈ పథకం అమలుకై ఏడాదిని మూడు బ్లాక్ పీడియడ్లుగా పరిగణించడం జరుగుతుందని, మొదటి బ్లాక్ పీడియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీడియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు మరియు మూడో బ్లాక్ పీడియడ్ ను డిశంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఏమన్నా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.