Andhrapradesh: రేపు అకౌంట్లలో డబ్బుల జమ
ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది.
By అంజి Published on 5 Jan 2025 7:17 AM ISTAndhrapradesh: రేపు అకౌంట్లలో డబ్బుల జమ
అమరావతి: ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లకు రేపు అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్టు తెలిపింది. కాగా ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందాయి. మరో వైపు పింఛన్లను కూడా డిసెంబర్ 31నే ప్రభుత్వం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అటు ఉపాధ్యాయులకు వెంటనే డిసెంబర్ నెల జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాశాఖలోని దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులకు జీతాలు అందలేదన్నారు. నూతన సంవత్సరం వేళ పలు ఖర్చులతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించిన కొత్త చట్టాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ బిల్లు ముసాయిదాను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ టీచర్ల బదిలీలపై విస్తృతంగా కసరత్తు చేసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో అనేక సమావేశాలు నిర్వహించింది. వచ్చే శుక్రవారం మరోసారి సంఘాల ప్రతినిధులతో సమావేశమై తుది సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం వేసవిలోనే బదిలీలు జరిగేలా చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు. బదిలీల నిబంధనలపై కొంత స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.