అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల గడువు ఈ నెల 23తో ముగియనుంది. ఇప్పటి వరకు 1,97,823 అప్లికేషన్లు వచ్చాయి. పురుషులు 66,104, మహిళలు 1,31,718 మంది దరఖాస్తు చేశారు. పురుషులతో పోలిస్తే మహిళల దరఖాస్తులు రెట్టింపు సంఖ్యలో వచ్చాయి. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఇన్ సర్వీస్ టీచర్లకూ కూడా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 17,883 మంది టీచర్లు టెట్‌కు అప్లై చేశారు.
అయితే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలైనందున తమకు ఈ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుందని టీచర్లు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్‌కు దరఖాస్తు చేసుకోలేదు. 2011వ సంవత్సరం నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అంతకుముందు నుంచి టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారు కూడా ఇప్పుడు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రంలో దాదాపు లక్ష మంది టీచర్లు ఈ పరీక్ష రాయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అందులో 25శాతం మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. టెట్ అర్హత సాధించేందుకు ఇన్ సర్వీస్ టీచర్లకు రెండేళ్ల సమయం ఉంది.