సీఎం జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశావని జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. జగన్‌కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు అని, టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అని అన్నారు. తాము కియా పరిశ్రమ తెస్తే.. జగన్ జాకీ, అమర్ రాజా కంపెనీలను వెళ్లగొట్టారు అని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమలో రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టామని, ఐదేళ్లలో ప్రాజెక్టులకు జగన్ పెట్టింది రూ.2 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేదే తమ ఆలోచన అని చెప్పారు.
హంద్రీనీవా నుంచి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు జగన్ అని చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలనేదే తన కల అని చంద్రబాబు తెలిపారు. నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్ అని, ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కడప స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. సీఎం జగన్‌కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రాతియుగం వైపు.. స్వర్ణ యుగం వైపు తీసుకెళ్తానన్నారు.