ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: వైఎస్‌ షర్మిల

రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరు అని షర్మిల ప్రశ్నించారు.

By అంజి  Published on  19 July 2024 8:55 AM GMT
Andhra Pradesh, farmers, loans, YS Sharmila

ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: వైఎస్‌ షర్మిల  

తెలంగాణలో రైతు రుణమాఫీ చేయడాన్ని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల స్వాగతించారు. 15 ఏళ్ళ క్రితం, ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. మళ్ళీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి సారథ్యంలో, సోనియా, రాహుల్ గాంధీ ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా, ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ, కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం.. చరిత్ర గర్వించే రోజు అని అన్నారు. రైతు కళ్ళల్లో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణం అని షర్మిల అన్నారు. ఇది రాహుల్ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజు అని అన్న వైఎస్‌ షర్మిల.. తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.

రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరు అని షర్మిల ప్రశ్నించారు. ఏపీలో సుమారు 2,45,554 రూపాయల రుణం ప్రతి రాష్ట్ర రైతు నెత్తి మీద కత్తిలా వేలాడుతోందని షర్మిల అన్నారు. ఏపీలోని కూటమి సర్కార్‌ కేంద్రం సాయంతో రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

''గడచినా దశాబ్దంలో అటు కరువు, తుఫానులు, ఇటు పూర్తికాని ప్రాజెక్టులు, సర్కారుల నిర్లక్ష్యం, వెరసి రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. మరి డబుల్ ఇంజిన్ సర్కారు నడుపుతున్న మీరు, కేంద్ర సాయంతో ఎందుకు రుణమాఫీ చేయకూడదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలము. కూటమి సర్కారును అడుగుతున్నాం, రైతు రుణమాఫీ చేయండి, అన్ని విధాలుగా చితికిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రైతులకు చేయూతనివ్వండి. ఇది ఛాయిస్ కాకూడదు, బాధ్యత అనుకోవాలి'' అని షర్మిల అన్నారు.

Next Story