ఏపీకి ఆరు స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులు
Andhra Pradesh received six awards in Swachh Sarvekshan 2022. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన
By అంజి
స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ర్యాంకింగ్స్‌లో లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల విభాగంలో మూడు నగరాలు- గ్రేటర్ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. ఇదే విభాగంలో టాప్ 100లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తర్వాత కర్నూలు, నెల్లూరు, కడప, రాజమహేంద్రవరం నిలిచాయి.
చెత్త రహిత నగరాలకు సంబంధించి విశాఖపట్నం, తిరుపతిలకు ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. మిలియన్ ప్లస్ సిటీ కేటగిరీ కింద విశాఖపట్నంకు 'టాప్ ఇంపాక్ట్ క్రియేటర్' అవార్డు కూడా లభించింది. సౌత్ జోన్‌లో 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో 21 నగరాలు టాప్ 100లో నిలవగా.. పుంగనూరు మూడో ర్యాంకు, పులివెందులకు తొమ్మిదో ర్యాంకు లభించాయి. 25,000 నుండి 50,000 వరకు జనాభా ర్యాంకింగ్‌లో సౌత్ జోన్‌లోని పట్టణాల కేటగిరీలో, ఎనిమిది పట్టణ స్థానిక సంస్థలు మొదటి 100 ర్యాంకుల్లో నిలిచాయి.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 'సఫాయిమిత్ర సురక్షా సెహర్'లో మొదటి ర్యాంక్ సాధించింది. పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి, మేయర్ డాక్టర్ ఆర్.శిరీష రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌కు 'క్లీనెస్ట్ క్యాపిటల్' అవార్డు లభించింది. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మేయర్ రాయల భాగ్యలక్ష్మి కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. 10 లక్షల నుంచి 40 లక్షల జనాభా ఉన్న విశాఖకు 'క్లీన్ బిగ్ సిటీ' అవార్డు దక్కింది. మున్సిపల్ కమిషనర్ పి.రాజబాబు, మేయర్ జి.హరి వెంకట కుమారి అవార్డును అందుకున్నారు.