కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh ranks 6th in corona cases.దేశంలో అత్యధిక క్రియాశీల కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది.
By తోట వంశీ కుమార్ Published on 6 May 2021 5:16 AM GMTదేశంలో కరోనా మహమ్మారి శర వేగంగా విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో గత రెండు వారాల వ్యవధిలో 30 జిల్లాలో అత్యధిక వేగంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. అందులో ఏడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవే ఉన్నాయి. అత్యధిక క్రియాశీల కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ వివరాలను వెల్లడించారు.
20 శాతంకిపైగా పాజిటివిటీ రేటు నమోదైన 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రోజువారి కేసుల గ్రాఫ్ సరళమవుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెరుగుతోంది. మొత్తం 24 రాష్ట్రాల్లో రోజువారీ కేసుల పెరుగుదల అధికంగా ఉండగా.. అందులో ఏపీ 4వ స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు ఉన్నాయి. 9 రాష్ట్రాల్లోని 30 జిల్లాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందులో బెంగళూరు అర్భన్, చెన్నై, కేరళలోని కోళికోడ్ లు తొలి మూడు స్థానాలను ఆక్రమించగా.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు 11, శ్రీకాకుళం 16, తూర్పుగోదావరి 17, గుంటూరు 19, విశాఖపట్నం 27, అనంతపురం 29, కర్నూలు 30వ స్థానంలో ఉన్నాయి.
ఏపీలో బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా 22,204 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 85 మంది మృతి చెందగా.. 11,128 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,06,232 కి చేరగా యాక్టివ్ కేసులు 1,70,588 గా ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు 10,27,270 కరోనా నుంచి కోలుకోగా 8,374 మంది ప్రాణాలు కోల్పోయారు.