వాట్సాప్ ద్వారా 100 సేవ‌లు అందించ‌నున్న ఏపీ ప్ర‌భుత్వం

రాష్ట్ర ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వ‌న‌రుగా ఉండాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  9 Nov 2024 2:06 AM GMT
వాట్సాప్ ద్వారా 100 సేవ‌లు అందించ‌నున్న ఏపీ ప్ర‌భుత్వం

రాష్ట్ర ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వ‌న‌రుగా ఉండాల‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స‌చివాల‌యంలో శుక్రవారం రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్‌లో జ‌రుగుతున్న డాటా ఇంటిగ్రేష‌న్ ప‌నులను గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ శాఖ కార్యద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్‌, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌లు ఆర్టీజీఎస్ ద్వారా చేప‌డుతున్న డాటా ఇంటిగ్రేష‌న్ ప‌నుల ప్రగ‌తి గురించి ముఖ్యమంత్రికి వివ‌రించారు. ప్రభుత్వంలో మొత్తం 40 శాఖ‌లున్నాయ‌ని, 128 విభాగాధిప‌తుల వ‌ద్ద 178 డాటా ఫీల్డుల నుంచి 500 టీబీల డాటా ల‌భ్యమ‌వుతుంద‌ని వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ డాటా అందించే ఏకైక వ‌న‌రుగా ప‌నిచేయాల‌ని అన్నారు. అన్ని విభాగాల్లోని డాటాను ఒక వేదిక‌పైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి, ప్రభుత్వ ప‌థ‌కాలు, కార్యక్రమాలను డాటా ద్వారా విశ్లేషించాల‌న్నారు. ఆర్టీజీఎస్ అనేది ప్రభుత్వానికి ఒక స‌దుపాయ సాధ‌నంగా, అన్ని వేళ‌లా స‌హాయ‌కారిగా ప‌నిచేయాల‌ని సూచించారు. పౌరులు ఇప్పటికి కూడా త‌మ‌కు కావాల్సిన ప్రాథ‌మిక‌మైన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, నివాసం, ఆదాయం, విద్యార్హత లాంటి ధృవీక‌ర‌ణ ప‌త్రాల కోసం అధికారులు, కార్యాల‌యాల చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేయాల్సి వ‌స్తోంద‌ని ఈ విధానం మారాల‌న్నారు. ప్రభుత్వం ప్రజ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చి వారికి కావాల్సిన సేవ‌ల‌న్నీ సులభంగా అందేలా చేయ‌నుంద‌ని, ఆ దిశ‌గా ప‌ని చేయాల‌న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 ల‌క్షల మంది పౌరులకు సంబంధించి డాటా లేద‌ని అధికారులు వివరించారు. ఈ డాటాను స‌త్వరం సేక‌రించి అనుసంధానించే చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని గృహాల‌ను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాల‌ని సూచించారు.

వాట్సాప్ ద్వారా ఈ నెలాఖ‌రుకు వంద సేవ‌లు పౌరుల‌కు అందుబాటులోకి తేవ‌డానికి కృషి చేస్తున్నట్లు సీఎంకు ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. అలాగే 90 రోజుల్లో విద్యార్థులు క్యూఆర్ కోడ్ ద్వారా త‌మ విద్యార్హత ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొందేలా కూడా చ‌ర్యలు చేప‌డుతున్నామ‌ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప‌నులు వేగ‌వంతంగా చేస్తున్నామ‌ని వివ‌రించారు. మార్చి నెలాఖ‌రు నుంచి పూర్తి స్థాయిలో ప్రజ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అందుబాటులోకి తేవాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నామ‌ని వివ‌రించారు. డిజిట‌ల్ సంత‌కం ఉన్న ధృవీక‌ర‌ణ ప‌త్రాలు భౌతికంగా స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రంలేద‌నే నియ‌మ‌నిబంధ‌న‌లున్నప్పటికీ అధికారుల్లో చాలా మందికి అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో విద్యార్థుల‌ను, ఇంటర్వ్యూ లకు వ‌చ్చే అభ్యర్థుల‌ను ఫిజిక‌ల్ స‌ర్టిఫికెట్లు పొందుప‌ర‌చాల‌ని చెప్తున్నార‌ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన ప్రజ‌లు, అధికారులు అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సిఎం ఆదేశించారు.

డాటా మొత్తం అనుసంధానించ‌డం ద్వారా పాల‌న‌లోనూ, ప‌థ‌కాల అమలులోనూ పార‌ద‌ర్శక‌త పెరుగుతుంద‌ని, త‌ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందని సిఎం అన్నారు. ఈ దిశ‌గా డాటా ఇంటిగ్రేష‌న్ ప‌నులు వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ త‌ప్పని స‌రి చేసేలా చూడాల‌ని, దానికి అనుగుణంగా ఉన్న స‌దుపాయాల‌పై క‌స‌ర‌త్తు చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆధార్ లేకుండా ఉండ‌కూడ‌ద‌ని చెప్పారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి నీర‌భ్‌కుమార్ ప్రసాద్, వివిధ శాఖ‌ల‌కు చెందిన అధికారులు పాల్గొన్నారు.


Next Story