పించన్ తీసుకోని వారికి తోడుగా ఉండండి.. జనసైనికులకు పవన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో పించన్ పంపిణీ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 April 2024 2:00 PM GMTపించన్ తీసుకోని వారికి తోడుగా ఉండండి.. జనసైనికులకు పవన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో పించన్ పంపిణీ కొనసాగుతోంది. బుధవారం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే.. ఉదయం నుంచే లబ్ధిదారులు సచివాలయాల దగ్గర పెద్ద సంఖ్యలు బారులు తీరారు. పించన్ల కోసం ఎదురుచూశారు. వృద్ధులు లైన్లలో నిలబడి ఎండకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లాలో వజ్రమ్మ అనే వృద్ధురాలు పించన్ కోసమే ఎండలో నిలబడి అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే మరణించిందని చెప్పారు. కొన్ని చోట్ల ఉదయం నుంచి ప్రారంభం కావాల్సిన పించన్ పంపిణీ ఆలస్యం అయ్యింది. బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకువచ్చే క్రమంలోనే ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు.
పించన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్న విషయం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన జనసేన కార్యకర్తలు, నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వృద్ధులు, దివ్యాంగులకు జనసైనికులు తోడుగా నిలబడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పించన్ తీసుకోవాల్సిన వృద్ధులు, దివ్యాంగులను గ్రామ, వార్డు సచివాలయాలకు జనసైనికులు తమ వాహనాల్లో తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వారికి పించన్ ఇప్పించి.. ఆ తర్వాత వారిని ఇంటి దగ్గర దించాలని చెప్పారు. సామాజిక బాధ్యతగా జనసైనికులంతా పించన్ తీసుకునే వారికి సహాయం అందించాలని కోరారు. జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో భాగం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి..పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పింఛన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం…
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2024
ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కూడా స్పందించారు. పించన్ తీసుకోవాల్సిన వారు ఆందోళన చెందొద్దని చెప్పారు. పెన్షన్ డబ్బుల పంపిణీ నాలుగు రోజుల పాటు జరుగుతుందని అన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దే పించన్ పంపిణీ చేస్తామని అంటున్నారు. సచివాలయాల వద్దకు వచ్చి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా చూస్తామన్నారు. మరో మూడ్రోజుల పాటు పించన్ పంపిణీ ఉంటుందనీ.. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి లబ్దిదారుడికి అందిస్తామని.. ఆందోళన అవసరం లేదని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.