వైసీపీకి ఓటు వేస్తే.. ఆస్తులపై హక్కులను వదిలేసుకున్నట్లే: పవన్ కల్యాణ్
కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ వారాహి విజయభేరి సభ నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 4 May 2024 10:42 AM GMTవైసీపీకి ఓటు వేస్తే.. ఆస్తులపై హక్కులను వదిలేసుకున్నట్లే: పవన్ కల్యాణ్
కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ వారాహి విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజలను హెచ్చరించారు. ల్యాండ్ టౌటిలింగ్ యాక్ట్ పేరితో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇక ఈ చట్టం వల్ల మన భూములపై కనీసం లోన్ తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు.
భూముల ఒరిజినల్ పత్రాలను ప్రభుత్వం అట్టిపెట్టకుంటుందని పవన్ కల్యాన్ చెప్పారు. ప్రజలకు భూములపై హక్కు లేకుండా చేస్తున్నారని ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ముందుగా పట్టాదారు పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్నాడనీ.. ఆ తర్వాత సరిహద్దు రాళ్లపైనా వేసకున్నాడని చెప్పారు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర ఉంటే.. జిరాక్స్ కాపీలతో లోన్లు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇదొక పిచ్చి చట్టమంటూ పవన్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్.. వైసీపీ మద్దతుదారులకు కూడా కొన్ని సూచనలు చేశారు. మీరు జగన్‌కు ఓటు వేస్తే మీ ఆస్తులపై మీరు హక్కులు వదిలేసుకున్నట్లే అంటూ హెచ్చరించారు. అందరి ఆస్తులు కూడా గాలిలో దీపంలా మారుతాయని పవన్ కల్యాణ్ అన్నారు.
రాష్ట్రంలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును ఎందుకు తీసేశారని పవన్ కల్యాణ్ నిలదీశారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. వైఎస్సార్ కంటే మహనీయులు ఉన్నారు.. ఆయన పేరు పెట్టుకోవచ్చు కానీ.. ఇతరులవి తొలగించి పెట్టొద్దని పవన్ కల్యాణ్ సూచించారు. వారికి గౌరవం కల్పించాలన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి గెలవబోతుందని దీమా వ్యక్తం చేశారు పవన్. జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని అన్నారు. మెజార్టీ ఎంతో మాత్రమే తెలియాల్సి ఉందన్నారు పవన్ కల్యాణ్.