నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారనే కారణంతో ఓ థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్ లేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ సినిమా రూల్స్ 1970 ప్రకారం.. లైసెన్స్ జారీ చేసే అధికారికి మాత్రమే థియేర్లను జప్తు చేసే అధికారం ఉందని చెప్పింది. ఈ నిబంధన ప్రకారం.. లైసెన్స్ జారీ చేసే అధికారం జాయింట్ కలెక్టర్‌కు(జేసీ) ఉందని.. జేసీ మాత్రమే థియేటర్‌ను జప్తు చేస్తారని తెలిపింది.
శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాసమహల్ థియేటర్ లైసెన్స్ పునరుద్దరణ కాలేదని.. తహసీల్దార్ ఆ థియేటర్ సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. థియేటర్ మేనేజింగ్ పార్టనర్ సనపాల శంకరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ థియేటర్‌ను సీజ్ చేశారని ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తహసీల్దార్ థియేటర్‌ను సీజ్ చేయడాన్ని తప్పుబట్టింది.
లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే థియేటర్‌ను సీజ్ చేసే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. వెంటనే థియేటర్‌ను తెరవాలని.. లెసెన్స్ పునరుద్దరణ అంశం లైసెన్స్ జారీ చేసే అధికారి వద్ద పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో సినిమాలను ప్రదర్శించుకోవచ్చునని సూచించింది.