అమరావతి: పెన్షన్ల లబ్ధిదారులకు నోటీసుల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. అర్హత లేని వారిని గుర్తించి, నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సెర్ప్ సీఈవో కలెక్టర్లను మంగళవారం ఆదేశించారు. తాజాగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పెన్షన్ తీసుకునే అనర్హులకు నోటీసులు జారీ చేయవద్దని ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా సూచించారు. ఇవాళ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం దీనిపై మరేదైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.
గత ప్రభుత్వ హయాంలో చాలామంది అర్హత లేకపోయాని సరే సర్టిఫికేట్లు తెచ్చుకుని పెన్షన్లు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం గుర్తించింది. పెన్షన్ల కోసం వైకల్యం ఉన్నట్లుగా నకిలీ సర్టిఫికెట్ కోసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఇచ్చారట. ఇలా చాలామంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
కాగా సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలు, సోషల్ మీడియా పోస్టులపై కేసులు, రాజధాని అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు వంటి పలు కీలక అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. అలాగే పెన్షన్ల లబ్ధిదారుల అంశంపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.