Andrapradesh: మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik
Andrapradesh: మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో కొత్తగా 'స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు' ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెప్మా ద్వారా 7 పట్టణ ప్రాంతాల్లో ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు.
కాగా అనంతపురం, కర్నూలు, తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్‌లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ ,వైఎస్‌ఆర్ కడప మున్సిపల్ కార్పొరేషన్లలో మార్కెట్లు ఏర్పాటు గరిష్టంగా 200 వరకు దుకాణాలను ఏర్పాటు చేసి పొదుపు మహిళలకు కేటాయించనున్నారు. మున్సిపాల్టీలు, బ్యాంకుల ద్వారా లబ్దిదారులకు రుణాలు ఇప్పించి ఈ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా మైపాడు రోడ్డులో 200 దుకాణాలతో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌కు మంచి స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో అమలుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.