దివ్యాంగులకు శుభవార్త..ఏడు వరాలు ప్రకటించిన ఏపీ సర్కార్
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By - Knakam Karthik |
దివ్యాంగులకు శుభవార్త..ఏడు వరాలు ప్రకటించిన ఏపీ సర్కార్
విజయవాడ: దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ఏడు వరాలు ప్రకటించారు. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే అందుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని దివ్యాంగులకు కూడా కల్పిస్తామని ప్రకటించారు. అటు స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్-పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు.
ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తాం..అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. SAAP ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని సీఎం పేర్కొన్నారు.
బాపట్లలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అదే చోట సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు. చివరగా రాష్ట్రస్థాయిలో అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.