Andhra Pradesh: రైతులకు గుడ్‌న్యూస్.. సూక్ష్మసేద్య పథకం
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla
Andhra Pradesh: రైతులకు గుడ్‌న్యూస్.. సూక్ష్మసేద్య పథకం
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు అడిగిన వెంటనే సూక్ష్మసేద్య పథకం మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు తన వాటా మొత్తం చెల్లిస్తే.. వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని శుక్రవారం నుంచే అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించే దిశలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూక్ష్మసేద్యం అమలు చేయడంపై దృష్టి పెట్టింది. ఇక అవసరం ఉన్న ప్రతి రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు అధికారులు ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అమలుకి తొలుత ప్రణాళికలు వేశారు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాల్లో అంచనాలను పెంచారు. 7.50 లక్షల ఎకరాలకు పెంచినట్లు వెల్లడించారు. పరికరాలు సమకూర్చేందుకు 33కంపెనీల ప్రతినిధులతో ఇటీవలే అధికారులు సమావేశం అయ్యారు. వారు గత ప్రభుత్వం చెల్లించాల్సి రూ.1,167 కోట్ల బకాయిల గురించి ప్రశ్నించారు. దాంతో.. ఇప్పటికే 175 కోట్ల రూపాయలు ఇచ్చామనీ.. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఇక ప్రభుత్వం హామీతో కొత్త యూనిట్ల ఏర్పాటుకి ముందుకు వచ్చారు. ఇక నుంచి సూక్ష్మసేద్యం అవసరమైన వారు అడగ్గానే వెంటనే ప్రభత్వం చర్యలు తీసుకోనుంది.