వంటనూనెల ధరలపై ప్రభుత్వం ఫోకస్..!
Andhra Pradesh Government Focus on Oil price.ఎక్కడో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేస్తుంటే.. దాని ప్రభావం మన
By తోట వంశీ కుమార్ Published on 17 March 2022 7:43 PM IST
ఎక్కడో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేస్తుంటే.. దాని ప్రభావం మన వంటింటిపై పడుతోంది. యుద్ధం సాకుగా చూపుతూ.. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. ముఖ్యంగా వంటనూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్ ఫ్లవర్, పామాయిల్, వేరుశనగ నూనెలు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని స్పష్టం చేసింది.
అంతేకాకుండా ధరల నియంత్రణ కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతు బజార్లో కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. మొబైల్ వాహనాల్లో కూడా ఆయిల్‌ను విక్రయించనున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా పంపిణీ చేయనున్నారు. దీంతో అధిక ధరలకు చెక్ పెట్టొచ్చునని ప్రభుత్వం బావిస్తోంది. అంతేకాకుండా నూనె వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఇక పై ప్రతిరోజు రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ఆదేశించింది. చౌకధరల దుకాణాల్లో ప్రజలు వంటనూనెలను కొనుగోలు చేయాలని సూచించింది. వంటనూనెలను అక్రమంగా నిల్వ చేసే వారిపై కేసులు నమోదు చేసి.. వారి వద్ద ఉన్న స్టాక్‌ను స్వాధీనం చేసుకుని తక్కువ ధరలకు విక్రయించే అవకాశాలను పరిశీలిస్తోంది. అలాగే ప్రభుత్వ అధికారులు హోల్ సేల్ డీలర్లు, మిల్లరు, రిఫైనరీదారులు కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాక్ పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయనున్నారు.