రేషన్‌కార్డులు ఉన్నవారికి ఏపీ సర్కార్ తీపికబురు
ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 3 Aug 2024 6:56 AM IST
రేషన్‌కార్డులు ఉన్నవారికి ఏపీ సర్కార్ తీపికబురు
ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. అమరావతి సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించిన సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని చెప్పారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధాన చర్చ జరిగింది. గత టీడీపీ ప్రభతు్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవాళ్లమని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కానీ.. ఆ తర్వాత వచ్చిన కిందటి వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. అయితే.. గతంలో లాగే సరుకుల పంపిణీని పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలో ధరల నియంత్రణ కూడా సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ, మార్కెటింగ్ పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. అయితే.. రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ద్వారా 2372 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్ కంటే తక్కువ రేటుకే ఆయా కౌంటర్లలో నిత్యావసర సరుకులు లభిస్తాయని చెప్పారు. కందిపప్పు, బియ్యం విక్రయిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. మార్కెట్‌లో రూ.180 ఉన్న కందిపప్పుని.. ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150కే ఇస్తున్నామని, బియ్యం కూడా కిలో రూ.48కి విక్రయిస్తున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుతో చెప్పారు. ఇక రేషన్ షాపుల్లో కూడా మరిన్ని సరుకులు తక్కువ ధరకు విక్రయించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
రేషన్ డోర్ డెలివరీ విదానంపైనా చర్చ జరిగింది. గతంలో ఈ డోర్‌డెలివరీ ఎండీయూ వాహనాల ద్వారా పని సరిగ్గా జరగలేదన్నారు చంద్రబాబు. వీధి చివరన వాహనం నిలిపి అక్కడికే పిలిచి రేషన్ ఇచ్చారన్నారు. కానీ రేషన్ డోర్ డెలివరీ పేరుతో రూ9,260 వాహనాలను .1,844 కోట్లతో కొనుగోలు చేశారని చెప్పారు. ఎండీయూ వాహనాల విషయంలో ఎలా వ్యవహరించాలి.. రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి, ఇతర అంశాలపై ప్రతిపాదనలతో రావాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచనలు చేశారు.