అమెరికా వెళ్లి వచ్చేందుకు నారాయణకు 3 నెలల సమయం
Andhra Pradesh Ex-minister Narayana. ఇప్పటికే ముందస్తు బెయిల్ దక్కించుకున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు
By Medi Samrat Published on 7 Sep 2022 12:00 PM GMTఇప్పటికే ముందస్తు బెయిల్ దక్కించుకున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు తాజాగా అమెరికాకు వెళ్ళడానికి కూడా లైన్ క్లియర్ అయింది. ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసులు నమోదైన నారాయణకు మంగళవారం ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌కు షరతులను జోడించి జారీ చేసిన ఉత్తర్వులను సవరించాలంటూ నారాయణ మరోమారు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ కింద దాఖలైన ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వైద్య చికిత్సల కోసం అమెరికా వెళ్లాల్సి ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు నారాయణ. ముందస్తు బెయిల్ షరతులను సడలించాలని కోరారు. ఈ పిటిషన్‌పై నారాయణ తరఫు న్యాయవాది వాదన విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ షరతులను సడలించింది. వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చేందుకు నారాయణకు హైకోర్టు 3 నెలల సమయాన్ని కేటాయించింది.
రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది. నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ అంజనీకుమార్, వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్‌కు అనుమతిచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా.. సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.