ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. నాలుగో దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 4 కోట్ల 14 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
ప్రధాన పార్టీల అధినేతలు రేపు పులివెందుల, మంగళగిరి నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలో ఓటు వేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
పవన్ కల్యాణ్ తన ఓటు తనకు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా ఓటు హక్కు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. పొత్తులో భాగంగా మంగళగిరి నుంచి టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో పవన్ సైకిల్ గుర్తుకే ఓటు వేసే అవకాశం ఉంది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఓటు ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం లేకుండా పోయిందని జనసేన వర్గాలు తెలిపాయి.