ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల
స్వర్ణాంధ్ర -2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళికగా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.
By Knakam Karthik
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల
స్వర్ణాంధ్ర -2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళికగా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. మొత్తం 120 సిఫార్సులను పొందుపరచిన ఈ నివేదికను టాస్క్ ఫోర్సు బృందం రూపొందించింది. మొత్తం 17 రంగాలకు సంబంధించి అమలు చేయాల్సిన సిఫార్సులను టాస్క్ ఫోర్సు ఇందులో నివేదించింది.
ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక ఆవిష్కరణ అనంతరం సీఎం పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ధిక పారిశ్రామిక అభివృద్ధి నివేదికను రూపొందించిన టాస్క్ ఫోర్సు సభ్యుల్ని ముఖ్యమంత్రి అభినందించారు. మరోవైపు ఏపీలో వచ్చే పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్కార్టు సర్వీసులు అందిస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులను రాష్ట్ర ప్రాజెక్టుగా భావించి ప్రభుత్వం చేయూత అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మూడు ఆర్ధిక కారిడార్లలో ఆయా రంగాలకు చెందిన పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు అనుకూలంగా విధానాలు రూపొందించామని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో వేగంగా అనుమతులు జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరారు. విజన్ 2020 పేరిట తాను ఆవిష్కరించిన అభివృద్ధి ప్రణాళిక వాస్తవ రూపం దాల్చి ఫలితాలు చూస్తున్నామని అన్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు చేశామని వెల్లడించారు.