'ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటా'.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ
ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోతే దాని ప్రభావం తనకు తెలుసని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
By అంజి Published on 26 Jun 2024 10:33 AM IST
'ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటా'.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ
విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమస్యను ప్రస్తావిస్తూ.. తన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోతే దాని ప్రభావం తనకు తెలుసని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం పంచాయితీ రాజ్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో కల్యాణ్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
''నేను మీ కష్టాలను అర్థం చేసుకున్నాను. నేను కూడా ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే, నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ఆయన జీతంతోనే మేం బతికాం. మేము స్కూల్ ఫీజు చెల్లించలేక బయటకు పంపబడిన సందర్భాలు ఉన్నాయి. చెల్లించిన తర్వాత మాత్రమే తిరిగి అనుమతించబడ్డాం. ఉద్యోగులు సకాలంలో జీతాలు అందుకోనప్పుడు, ముఖ్యంగా నెలాఖరులో వారి కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడినప్పుడు దాని ప్రభావం నాకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది'' అని అన్నారు.
కాగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 26న వారాహి దేవికి అంకితం చేసిన 11 రోజుల వారాహి విజయ దీక్ష (ఉపవాసం) చేపట్టనున్నారు. ఈ సమయంలో ఆయన పాలు, పండ్లు, నీళ్లు మాత్రమే తీసుకుంటారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయత్నాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది జూన్‌లో ఆయన వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుట్టి, వారాహీ దేవికి పూజలు చేసి, ఆ తర్వాత దీక్ష చేపట్టారు.
ఇటీవల ప్రముఖ తెలుగు సినీ నిర్మాతలు సోమవారం ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్‌తో సమావేశమై తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా రంగాన్ని ఎలా విస్తరించాలనే దానిపై చర్చించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని శరవేగంగా తీసుకెళ్తామని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. ఒక బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు, కొత్త ప్రభుత్వం ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అంగీకరించారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, రాష్ట్రాన్ని ప్రగతిశీల పథంలోకి తీసుకెళ్లడానికి ప్రతి అడుగు వేస్తుందన్నారు. ఐదేళ్ల వైఎస్‌ఆర్‌సీపీ పాలన పీడకలగా మారిందని, రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో అవినీతి రాజ్యమేలిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తీవ్రంగా నష్టపోయిన రంగాలపై త్వరలో శ్వేతపత్రాలు ప్రచురిస్తామని, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు తొలగించి రైతులకు కొత్త పాసుపుస్తకాలు అధికారిక ముద్రతో త్వరలో జారీ చేస్తామని ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పారు.