ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోండి.. పవన్ కల్యాణ్ ట్వీట్
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Sept 2024 9:30 PM ISTశ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాజకీయంగానూ ఈ అంశంపై దుమారం రేగింది. ఇక ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూ మహా ప్రసాదం జంతు అవశేషాలతో కల్తీ జరిగింది అని అన్నారు. మహా అపచారానికి గురైందని తెలిపారు. దీన్ని నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఈ డిజైన్‌లో మీ ఫోటో పెట్టుకుని ‘‘ఓం నమో నారాయణాయ’’ మహా మంత్రాన్ని జపించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని క్షమాపణ వేడుకోవాలన్నారు. ఆలయ సంప్రదాయాలు, సనాతన ధర్మం పవిత్రతను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. సెప్టెంబర్ 22న గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన 11 రోజులపాటు దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష తర్వాత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.