బతుకులను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి: సీఎం జగన్
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla
బతుకులను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి: సీఎం జగన్
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వైసీపీ అధినేత, సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే బస్సుయాత్ర ఇవాళ మంగళగిరికి చేరుకుంది. అక్కడ సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. టీడీపీపై పలు విమర్శలు చేశారు. అలాగే ఎన్నికలపై రాష్ట్ర ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో మన బతుకులను మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓటువేసే సమయంలో ప్రతి ఒక్క ఓటరు అప్రమత్తంగా ఉండాలనీ.. లేదంటే మోసపోతామని సీఎం జగన్ అన్నారు. రంగురంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు వస్తున్నారనీ.. ఆయన పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తోన్న చంద్రబాబు గతంలో ఎన్ని అన్యాయాలు చేశారో గుర్తు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. గతంలో చంద్రబాబు పాలనను చూశారనీ.. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. గతంలో తాము అధికారంలోకి వచ్చి 98 శాతం హామీలను ఎగ్గొట్టారని మండిపడ్డారు. టీడీపీ పాలన, వైసీపీ పాలనలో తేడాలను ప్రజలే గమనించాలని సీఎం జగన్ అన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970 కోట్లు తాము చేనేత కార్మికులకు అందించినట్లు వెల్లడించారు. అలాగే మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి చేయూతనిచ్చామని పేర్కొన్నారు. దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించినట్లు సీఎం జగన్ చెప్పారు. అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా నగదు చేశామన్నారు. వాలంటీర్ల వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్ అందించామనీ.. పెన్షన్‌ను రూ.3వేలకు పెంచిన ఘనత తమదే అని అన్నారు. ఎన్నికల్లో బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలంటూ సీఎం జగన్ ఈ మేరకు పిలుపునిచ్చారు.