సొంత నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు
By Knakam Karthik
సొంత నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు వరాలు జల్లు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. నియోజకవర్గంలో రూ.1292.74 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం తుమ్మిశిలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ సభలో చంద్రబాబు మాట్లాడారు. రైతుల పంపుసెట్లకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే పనిలేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కుప్పం రూపులేఖలు మార్చబోతున్నామన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా నియోజకవర్గం నిలవబోతోందని చెప్పారు.
ఈ ఏడాదిలోనే సాగు నీళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు. సంవత్సర కాలంలో సుపరిపాలన అందించే దిశగా ప్రయత్నం చేశామని చెప్పారు. రూ.1617 కోట్లతో కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయన్నారు. హంద్రీనీవా ద్వారా శ్రీశైలం నుంచి కుప్పానికి సాగునీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని, రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తామని తెలిపారు.కుప్పం పట్టణ రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.