నేటి నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రసంగం చేస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసన సభ వాయిదా పడుతుంది. గవర్నర్‌గా బిశ్వభూషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. మహమ్మారి కరోనా కారణంగా గత రెండేళ్లుగా బడ్జెట్ సమావేశాలప్పుడు గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడారు.
ఇవాళ గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీసీఏ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ నిర్ణయిస్తారు. ఆ వెంటనే సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులపై చర్చ జరిపి, వాటికి ఆమోదం తెలపనుంది కేబినెట్. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ, పలు అంశాలను కేబినెట్‌లో చర్చించనున్నారు. మంగళవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల సంతాపం తెలుపుతూ ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. బుధవారం రోజున ఉభయ సభలు వాయిదా పడుతాయి.